కీర్తనలు 95

? AI
1
రండి, యెహోవాకు పాట పాడదాం, మన రక్షణకు ఆధారశిలకు ఆనందంగా పాడదాం.
2
కృతజ్ఞతతో ఆయన సన్నిధికి వద్దాం, ఆయనకు స్తుతి గీతాలు పాడదాం.
3
యెహోవా గొప్ప దేవుడు. దేవుళ్ళందరికీ పైగా ఉన్న గొప్ప రాజు.
4
భూమి అగాధస్థలాలు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వత శిఖరాలు ఆయనవే.
5
సముద్రం ఆయనది. ఆయనే దాన్ని చేశాడు. ఆయన చేతులు పొడి నేలను చేశాయి.
6
రండి సాగిలపడి ఆరాధన చేద్దాం. మన సృష్టికర్త యెహోవా ఎదుట మోకరిల్లుదాం.
7
ఆయన మన దేవుడు. మనం ఆయన పోషించే ప్రజలం. ఆయన చేతికింది గొర్రెలం. ఈ రోజున మీరు ఆయన స్వరం వింటే ఎంత బాగుండు!
8
మెరీబా దగ్గర, ఎడారిలో మస్సా దగ్గర ఉన్న సమయంలో మీ పూర్వీకుల్లాగా మీ గుండె కఠినం చేసుకోవద్దు.
9
అక్కడ వాళ్ళు నా అధికారాన్ని సవాలు చేశారు నా కార్య కలాపాలు చూసి కూడా నా ఓపికను పరీక్షించారు.
10
నలభై ఏళ్ళు నేను ఆ తరం వారితో కోపంగా ఉన్నాను. వాళ్ళ హృదయాలు దారి తప్పుతున్నాయి. వాళ్ళు నా పద్ధతులు తెలుసుకోలేదు అన్నాను.
11
కాబట్టి, వాళ్ళు నా విశ్రాంతి స్థలంలో ఎన్నడూ ప్రవేశించరని నేను నా కోపంలో శపథం చేశాను.